🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 21 Jun, 2026 | Page: 1

ప్రేమ వ్యవహారంలో దళిత యువకుడి హత్య కేసు ఛేదన

48 గంటల్లోనే ఆరుగురు నిందితుల అరెస్ట్ – ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే

ఆదిలాబాద్, జూన్ 21: నేరడిగొండ మండలంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఎస్సీ యువకుడి హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ వెల్లడించారు.


నేరడిగొండ మండలం పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన నాతరి సతీష్ (23) ఈ నెల 17న కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం జూన్ 19న కరాత్‌వాడ చెరువులో అతని మృతదేహం లభ్యమవడంతో కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో ప్రధాన నిందితుడు షేక్ సుమేర్ తన ప్రేమ వ్యవహారానికి సతీష్ అడ్డుగా ఉన్నాడనే కక్షతో కుట్ర పన్నినట్లు తేలింది. తన స్నేహితులతో కలిసి మద్యం పార్టీ పేరుతో సతీష్‌ను కరాత్‌వాడ చెరువు వద్దకు పిలిపించి, బలవంతంగా మద్యం తాగించి అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడవేసి, మృతుడి ద్విచక్ర వాహనాన్ని ఆదిలాబాద్‌కు తరలించడంతో పాటు మొబైల్ ఫోన్‌ను రైలులో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు.

సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యేక బృందాల సహకారంతో కేసును ఛేదించిన పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి ద్విచక్ర వాహనం, సంఘటన స్థలంలో లభించిన 7 ఖాళీ బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసి నేరానికి పాల్పడినందున నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ (దౌర్జన్యాల నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(2)(v) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.

అరెస్టైన నిందితులు

షేక్ సుమేర్ (24) – కుమారి గ్రామం (ప్రస్తుతం బోథ్)

గంగాధరి సాయి కృష్ణ (23) – నేరడిగొండ

బొజ్జ విష్ణువర్ధన్ (22) – కుప్తి గ్రామం

షేక్ అక్రమ్ (22) – ఇస్లాంపురా కాలనీ, బోథ్

అబ్దుల్ నెహెఫ్ (19) – సాయినగర్ కాలనీ, బోథ్

సయ్యద్ నోమాన్ (19) – సాయినగర్ కాలనీ, బోథ్


ప్రేమ వ్యవహారాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని, నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే హెచ్చరించారు.
🏠 Home