రేపు కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి
Posted by: admin | Published on: 31 May 2026, 06:36 PM
కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాలు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం
*ఏర్పాట్ల పర్యవేక్షణకు వందే భారత్‌లో కాగజ్‌నగర్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి*
*తోటి ప్రయాణికులతో మంత్రి ముచ్చట్లు.. రైలులోనే భోజనం*
హైదరాబాద్, మే 31: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో కీలక ఘట్టానికి చేరుకోనుంది. తొలి విడత ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశాలకు సిద్ధమవుతుండగా, రెండో విడతకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పేద కుటుంబాలకు గూడు కల్పించే దిశగా ఈ కార్యక్రమం మరో ముందడుగుగా నిలవనుంది.
ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన సాయంత్రం కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు.
రైలు ప్రయాణం సందర్భంగా మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. వందే భారత్ ట్రైన్ లో మధ్యాహ్న భోజనం చేశారు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మరికాసేపట్లో సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, హెలిపాడ్, వేదిక ఏర్పాట్లు, సదుపాయాలను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమై వేగంగా కొనసాగుతోంది. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం, సొంతింటి భరోసా కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ పథకానికి కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లా వేదిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనుండటంతో ప్రభుత్వ గృహ విప్లవంలో ఇది మరో చారిత్రక ఘట్టంగా నిలవనుంది.