రియాద్‌లో తెలంగాణ కార్మికుడు మృతి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాటా సహకారం
రియాద్: తెలంగాణకు చెందిన వలస కార్మికుడు శ్రీ గడ్డం మోహన్ రియాద్‌లోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మృతి చెందారు.
మోహన్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, ఆయన కుమారుడు శ్రీ గడ్డం అరుణ్ చేసిన విజ్ఞప్తి మేరకు సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మచ్చ తెలంగాణ ప్రభుత్వంలోని సీఎం ప్రవాసి ప్రజావాణి (NRI సెల్), కుటుంబ సభ్యులు, ఆసుపత్రి అధికారులు, భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేస్తూ, మోహన్‌ను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలనీ విన్నవించారు.
అయితే, చికిత్స పొందుతున్న సమయంలోనే శ్రీ గడ్డం మోహన్ మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషాద సమయంలో సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడి, వారికి ధైర్యం చెబుతూ, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
మోహన్ మృతదేహాన్ని సురక్షితంగా భారతదేశానికి తరలించే వరకు సాటా తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ శ్రీనివాస్ మచ్చ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మృతదేహాన్ని భారత్‌కు ఎలా తరలించాలి, అవసరమైన అధికారిక ప్రక్రియలు, సంబంధిత అధికారులతో సమన్వయం వంటి అంశాల్లో కూడా సాటా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
సాటా ప్రతినిధులు శ్రీ ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, శ్రీ సింగు నరేష్ కుమార్, ముదిగొండ శంకర్ తదితరులు సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, శ్రీ గడ్డం మోహన్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు కృషి చేస్తున్నారు.
ఈ విషాద సమయంలో గడ్డం మోహన్ కుటుంబ సభ్యులకు సాటా మరియు శ్రీని హ్యుమానిటీ సర్వీస్ రియాద్ అధ్యక్షులు దూడం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఈ కష్ట సమయంలో సాటా మరియు శ్రీని హ్యుమానిటీ సర్వీస్ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది.