🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 22 Aug, 2026 | Page: 1

మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఖతార్ ప్రవాస తెలుగు సమాజం


Saudi Arabia: ఒంగోలు వాసి, ఏ కె వి అధ్యక్షుడు మరియు ఎన్ ఆర్ ఐ టి డి పి ఖతార్ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గడ్డె శ్రీనివాస్ చొరవతో స్వర్గీయ సుంకై మల్లేశ్ కుటుంబానికి రూ.11 లక్షలకు పైగా ఆర్థిక సహాయం.

దోహా, ఖతార్:
కష్టకాలంలో ఉన్న ఒక తెలుగు కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వానికి నిజమైన అర్థాన్ని చాటిచెప్పింది ఖతార్ లోని ప్రవాస తెలుగు సమాజం. నిజామాబాద్ జిల్లాకు చెందిన స్వర్గీయ సుంకై మల్లేశ్ ఇటీవల ఖతార్ లో మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ, మరోవైపు కుమార్తె వివాహం సమీపిస్తున్న తరుణంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టాయి.

ఈ పరిస్థితిని తెలుసుకున్న ఆంధ్ర కళా వేదిక (ఏ కె వి) అధ్యక్షుడు, ఎన్ ఆర్ ఐ టి డి పి ఖతార్ అధ్యక్షుడు, ఒంగోలు వాసి గొట్టిపాటి రమణయ్య మరియు తెలంగాణ ప్రజా సమితి (టి పి యస్) అధ్యక్షుడు గడ్డె శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. వివిధ తెలుగు సంఘాలు, నాయకులు, ప్రవాసులు, శ్రేయోభిలాషులను సమన్వయం చేసి బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కృషి చేశారు.

వారి చొరవకు స్పందించిన ప్రవాస తెలుగు సమాజం పెద్ద మనసుతో ముందుకు వచ్చి మొత్తం 42,966 ఖతార్ రియాల్స్ సేకరించింది. ఈ మొత్తాన్ని స్వర్గీయ మల్లేశ్ భార్యకు అందజేశారు. భారత కరెన్సీలో ఈ సహాయం సుమారు రూ.11.19 లక్షలు.

ఈ సహాయ కార్యక్రమంలో ఆంధ్ర కళా వేదిక (ఏ కె వి) 26,616 ఖతార్ రియాల్స్ అందించి అత్యధిక భాగస్వామ్యంతో నిలిచింది. ఒక కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు సంస్థల పేర్లు, ప్రాంతీయ భేదాలు పక్కనపెట్టి అందరూ ఒక్కటిగా నిలవడం ప్రవాస తెలుగు సమాజం ఐక్యతకు, మానవత్వానికి గొప్ప నిదర్శనంగా నిలిచింది.

విరాళాల వివరాలు

* ఆంధ్ర కళా వేదిక (ఏ కె వి) 26,616 ఖతార్ రియల్
* తెలంగాణ ప్రజా సమితి (టి పి యస్) 12,250 ఖతార్ రియల్
* తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ( టి డబ్ల్యూ ఏ) 3,100 ఖతార్ రియల్
* తెలంగాణ గల్ఫ్ సమితి (టి జి యస్) – 1,000 ఖతార్ రియల్
* మొత్తం – 42,966 ఖతార్ రియల్

ఈ సేవా కార్యక్రమానికి ముందుండి సహకరించిన టీ పి పీస్, ఏ కె వి, టి డబల్యూ ఏ మరియు టి జి యస్ మేనేజ్ మెంట్ కమిటీలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డా. అమూల్య రావు మరియు లయోలా ఇంటర్నేషనల్ స్కూల్, ఖతార్ మేనేజ్ మెంట్ అందించిన సహాయానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ, కష్టకాలంలో ఒక కుటుంబానికి అండగా నిలవడం కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు మన మానవత్వాన్ని చాటుకోవడం. స్వర్గీయ సుంకై మల్లేశ్ కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో, ముఖ్యంగా ఆయన కుమార్తె వివాహం సమీపిస్తున్న వేళ, మన ప్రవాస తెలుగు సమాజం ఒక్కటిగా స్పందించడం ఎంతో హృదయస్పర్శగా ఉంది. ఈ సహాయం ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు, ‘మీకు మేమున్నాం’ అనే ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తుంది. ఈ సేవలో భాగమైన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు.

స్వర్గీయ మల్లేశ్ కుటుంబానికి అందించిన ఈ సహాయం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, కష్టసమయంలో తోడుగా నిలిచిన ఆప్యాయత, మానవత్వం, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచింది.

ప్రాంతం, సంస్థ, వ్యక్తిగత పరిచయాలకు అతీతంగా ప్రవాస తెలుగు సమాజం మొత్తం ఒక కుటుంబంలా స్పందించి ఒక బాధిత కుటుంబానికి అండగా నిలవడం ఖతార్ లోని తెలుగు సమాజ ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

మనలో ఒకరు కష్టంలో ఉన్నప్పుడు మనమంతా ఒక్కటై నిలబడాలి అనే స్ఫూర్తిని ఆచరణలో చూపించిన ఈ కార్యక్రమం, మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని చాటి చెప్పింది.

ఈ సేవా కార్యక్రమానికి విరాళాలు అందించి, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయం ఆ కుటుంబానికి ఎప్పటికీ మరచిపోలేని మానవీయ అండగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

స్వచ్ఛమైన సేవకు దేశాలు, రాష్ట్రాలు, కుల, మత భేదాలు ఏమాత్రం అడ్డంకులు కావని చాటి చెప్పిన *ఖతార్ ప్రవాస తెలుగు సమాజానికి టాసా, సాటా, శ్రీని హ్యుమానిటీ సర్వీస్ ప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.*

ఈ సందర్భంగా టాసా, సాటా మరియు శ్రీని హ్యుమానిటీ సర్వీస్ ప్రతినిధులు మాట్లాడుతూ, *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఒంగోలు వాసి, ఏ కే వీ అధ్యక్షులు మరియు ఎన్ ఆర్ ఐ టి డి పి కతర్ అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య గారు*, అలాగే *తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖతార్ తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు గడ్డె శ్రీనివాస్ గారు* రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఐకమత్యంతో ముందుకు వచ్చి సేవలందించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.

ఈ సందర్భంగా *టాసా సౌదీ అరేబియా అధ్యక్షులు తిరుపతిస్వామి స్వర్ణ, రియాద్ అధ్యక్షులు మురారి తాటికాయల, ఉపాధ్యక్షులు మహేంద్ర వాకాటి, ఇబ్రహీం, శివ, భాస్కర్, భూమెని నటరాజ్ కుమార్, అజయ్, రాము, సాయి, హరీష్, ప్రసాద్, బద్రి, *, అలాగే *సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, నూరుద్దీన్, కాజా ముజమ్మిల్ ఉద్దీన్, సురేష్, సింగు నరేష్ కుమార్, ముదిగొండ శంకర్, అస్లాం, లోకేష్ కోకిల,* *శ్రీని* *హ్యుమానిటీ సర్వీస్ రియాద్ అధ్యక్షులు దూడం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్* తదితర ముఖ్య సభ్యులు ఖతార్ ప్రవాస తెలుగు సమాజానికి తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

*ఖతార్ లోని తెలుగు సంఘాలు అందిస్తున్న సేవలు సౌదీ అరేబియాలోని తెలుగు సంఘాలకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలవాలని* టాసా, సాటా మరియు శ్రీని హ్యుమానిటీ సర్వీస్ ప్రతినిధులు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఆపదలో ఉన్న తోటి తెలుగు వారికి అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుకోవడం ప్రతి తెలుగు సంఘం బాధ్యతగా భావించాలని వారు పేర్కొన్నారు.
🏠 Home