🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 02 Aug, 2026 | Page: 1

కువైట్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ

రియాద్: కువైట్‌లోని బుబియాన్ ద్వీపంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన పౌర వాహనాలే లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడులను గల్ఫ్ సహకార మండలి (GCC) ప్రధాన కార్యదర్శి జాసెం మొహమ్మద్ అల్-బుదైవి తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ దాడులను కువైట్ సార్వభౌమాధికారంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలు ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాలను దెబ్బతీసే ఉద్దేశంతో చేసినవని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా, ఈ దాడులు కువైట్‌లోని పౌరులు, స్థానిక నివాసితుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఇరాన్ చర్యలు అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని అల్-బుదైవి పేర్కొన్నారు.

కువైట్ తన దేశ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకునే క్రమంలో తీసుకునే ప్రతి చర్యకు జీసీసీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.గల్ఫ్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం కొనసాగాలంటే ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని.. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలని అంతర్జాతీయ సమాజానికి జీసీసీ పిలుపునిచ్చింది.
🏠 Home